విస్తరణకు ఏకగ్రీవ ఆమోదం..
● మహిళా కౌన్సిలర్లతో పాటు
కుటుంబసభ్యులు హాజరు..
వారే సమస్యలు లేవనెత్తిన వైనం
● నిర్వహణ తీరుపై అధికారపార్టీ సభ్యుల ఆగ్రహం
వనపర్తి టౌన్: స్థానిక పుర కౌన్సిల్ సమావేశం ఇష్టారాజ్యంగా సాగుతోంది. అవగాహన లేక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఉదంతాలు అధికార పార్టీలోనే అగ్గి రాజేస్తున్నాయి. కనీసం విలేకర్లను సైతం సమావేశానికి హాజరు కానివ్వకుండా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారనేందుకు శుక్రవారం జరిగిన సమావేశం ఒక ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పుర కౌన్సిల్ సాధారణ అత్యవసర సమావేశం శుక్రవారం పుర కార్యాలయంలో పుర చైర్‌పర్సన్ మాధవి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన మహిళా కౌన్సిలర్లతో పాటు వారి భర్తలు, కుమారులు సైతం హాజరై వాదనలు వినిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారే కౌన్సిలర్లుగా వ్యవహరిస్తూ సమావేశంలో మాట్లాడటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ వ్యవహారంపై అధికారులుగాని, చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌గాని అభ్యంతరం తెలుపకపోవడం, అడ్డుకోకపోవడం, సమావేశం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
సమావేశం నిర్వహణపై ఆగ్రహం..
సమావేశం ముగిసిన అనంతరం అధికార పార్టీకి చెందిన సభ్యులు చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కౌన్సిల్ సమావేశం నిర్వహించే పద్ధతి ఇదేనా? ఎన్నికై న కౌన్సిలర్లు కాకుండా వారి భర్తలు, కుమారులు సైతం సమావేశంలో కూర్చొని వారే కౌన్సిలర్లుగా వాదనలు వినిపిస్తుంటే అడ్డుకునే బాధ్యత లేదా? కనీసం సమావేశాన్ని సక్రమంగా నిర్వహించాలనే ఆలోచన కూడా లేదా? అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశంలో ఎవరు మాట్లాడాలి.. ఎవరు మాట్లాడకూడదనే నియంత్రణ లేకపోయిందని, చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ వ్యవహారశైలితో పాటు అధికారుల మౌనంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
మరోవైపు పట్టణంలో కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విస్తరణ పనులకు కౌన్సిలర్లు సహకరించాలని సమావేశంలో కోరారు. డ్రైనేజీ నిర్మాణానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించేందుకు అయ్యే యంత్రాల అద్దె, డీజిల్ ఖర్చు చెల్లింపునకు నిర్ణయించారు. అయితే ఇందుకు ఎంత ఖర్చవుతుందనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. పనుల భారాన్ని బట్టి త్వరలోనే ఖర్చు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అదేవిధంగా పురపాలికకు చెందిన టౌన్‌హాల్‌ను టెండర్ ద్వారా లీజుకు ఇవ్వాలని, పట్టణంలో డంపింగ్‌యార్డుకు, మిగిలిన రహదారి పనులు చేపట్టాలని తీర్మానించారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సమావేశంలో సూచించారు. సమావేశంలో వైస్ చైర్మన్ గౌడ్, కమిషనర్ నిరంజన్, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


