వనపర్తి రూరల్: సమాజం, దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని.. వారిని స్మరించుకుంటూ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ డి.సునీతరెడ్డి కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. శిబిరంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మొత్తం 129 మంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సేకరించిన రక్త యూనిట్లను ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రక్తం ఎంతో విలువైందని, రక్తదానం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపడంతో పాటు ప్రశంసాపత్రాలు, పండ్లు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. చంద్రమోహన్, డా. జ్యోతి, ఆర్‌ఎం డా. జావీద్, సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు సుగంధ రత్నం, రమేష్, శివకుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, జిల్లాలోని ఎస్సైలు, పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.


