వేరుశనగ విత్తనాలకు రోడ్డెక్కిన మహిళలు | - | Sakshi
Sakshi News home page

వేరుశనగ విత్తనాలకు రోడ్డెక్కిన మహిళలు

Oct 31 2026 12:25 AM | Updated on Oct 31 2026 12:25 AM

ఖిల్లాఘనపురం: ప్రభుత్వం వందశాతం రాయితీపై అందించిన వేరుశనగ విత్తనాలు అర్హులకు ఇవ్వడం లేదంటూ శుక్రవారం మండలంలోని సోళీపురం గ్రామంలో గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు అధికసంఖ్యలో వనపర్తి–ఖిల్లాఘనపురం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అనర్హులకు విత్తనాలు పంచారని, అధికారులు వచ్చి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వేరుశనగ విత్తనాలు తీసుకున్న వారు ప్రైవేట్‌గా విక్రయించారని.. పంట సాగు చేయని వారికి కూడా విత్తనాలు ఇచ్చారని తెలిపారు. అధికారులు స్పందించి పూర్తి వివరాలు సేకరించి బుక్‌ కీపర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామసంఘం లావాదేవీల విషయంలో ఏపీఎం వచ్చి లెక్కలు చెప్పాలన్నారు. వేరుశనగ విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్న రైతులకు విత్తనాలు ఇవ్వాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, ఏపీఎం నాగరాజు, ఎస్సై వెంకటేష్‌ ఘటన స్థలానికి చేరుకొని మహిళలతో మాట్లాడారు. ఆందోళన విరమించి రైతువేదిక వద్ద కూర్చొని మాట్లాడుదామని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించడంతో విరమించి రైతువేదిక దగ్గరకు వెళ్లారు. అక్కడ అధికారులు మాట్లాడుతూ.. అనర్హులకు విత్తనాలు పంపిణీ చేసినట్లు ఉంటే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులకు వేరుశనగ విత్తనాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామ మహిళా సంఘంలో డబ్బుల లావాదేవీల వ్యవహారం ఏపీఎంతో చర్చించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement