అమరచింత: భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, భూగర్భ జలశాఖ ఏడీ ఉమేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఉన్న ఫోజోమీటర్ వద్ద భూగర్భ జలమట్టం ఎంతమేరకు ఉందనే విషయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూగర్భ జలాలను అవసరానికి మించి వినియోగించడంతో నీటిమట్టాలు తగ్గిపోతున్నాయన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను అవలంబించాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలన్నారు. నీటిని వృథా చేయకుండా భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందించేలా రైతులు తమవంతు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అరవింద్, ఉద్యాన అధికారి సురేష్, రైతులు పాల్గొన్నారు.


