లెదర్‌ పార్కులు.. ఏళ్లుగా పడకేశాయి! | - | Sakshi
Sakshi News home page

లెదర్‌ పార్కులు.. ఏళ్లుగా పడకేశాయి!

Oct 29 2026 12:24 AM | Updated on Oct 29 2026 12:24 AM

ఉపాధి హామీ ఉత్తిమాటే..

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

● పోలేపల్లి, జినుకుంటలో 50 ఎకరాలు నిరుపయోగం

● రూ.2 కోట్ల యంత్రాలు తుప్పుపాలు.. శిథిలావస్థలో భవనాలు

●

జడ్చర్ల: దళిత యువతకు ఉపాధి కల్పించడంతోపాటు చర్మ ఉత్పత్తుల పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన లెదర్‌ పార్కులు నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి పాలమూరులోని పోలేపల్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లా జినుకుంటలో కలిపి 50 ఎకరాలు కేటాయించగా, భవనాలు శిథిలావస్థకు చేరాయి. సుమారు రూ.2 కోట్లతో సమకూర్చిన యంత్రాలు తుప్పుపట్టాయి. యువతకు శిక్షణ ఇచ్చినా పరిశ్రమలు ప్రారంభం కాకపోవడంతో ఉపాధి అవకాశాలు దక్కలేదు.

రెండు చోట్లా 25 ఎకరాలు

చర్మ ఉత్పత్తుల పరిశ్రమల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 2002లో జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌ సమీపంలో లిడ్‌క్యాప్‌కు 25 ఎకరాల అసైన్డ్‌ భూమిని కేటాయించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం జినుకుంటలో మరో 25 ఎకరాలు ఇచ్చారు. పోలేపల్లిలో 2004లో ‘మలుపు’ పథకం కింద రూ.10 లక్షలతో, జినుకుంటలో రూ.25 లక్షలతో భవనాలు నిర్మించారు. యంత్రాల కోసం సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసినా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు.

శిక్షణ ఇచ్చారు.. ఉపాధి మరిచారు

చర్మ ఉత్పత్తుల తయారీలో నిరుద్యోగ దళిత యువతకు శిక్షణ ఇచ్చారు. జడ్చర్ల పారిశ్రామిక పార్కులో సుమారు 250 మందికి, జినుకుంటలో 400 మందికి శిక్షణ అందించారు. కొందరిని చైన్నెకి కూడా పంపించారు. శిక్షణ సమయంలో నెలకు రూ.1,500 స్టైపెండ్‌ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.7,500 రుణసదుపాయం కల్పించారు. లెదర్‌ పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి లభిస్తుందని ఆశించిన యువతకు నిరాశే మిగిలింది.

రూ.60 లక్షలు ఏమయ్యాయి?

పోలేపల్లిలోని లిడ్‌క్యాప్‌ శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభించేందుకు 2022లో ప్రభుత్వం రూ.60 లక్షలు కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. సీఎల్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. అయితే నిధుల వినియోగం, శిక్షణ కేంద్రం పునఃప్రారంభంపై స్పష్టత లేదు. మరోవైపు పోలేపల్లిలో భవనం శిథిలావస్థకు చేరగా, జినుకుంటలోనూ భవనం దెబ్బతింది. యంత్రాలు తుప్పుపట్టి నిరుపయోగంగా మారాయి.

భూముల విలువ పెరిగినా..

పోలేపల్లి భూమిని 2008లో లెదర్‌ పార్కు ఏర్పాటుకు లిడ్‌క్యాప్‌ అప్పటి ఏపీఐఐసీకి అప్పగించింది. అభివృద్ధి జరగకపోవడంతో 2013లో ప్రభుత్వం తిరిగి లిడ్‌క్యాప్‌కు బదలాయించింది. అయినా పనులు ముందుకు సాగలేదు. సెజ్‌, జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఇక్కడ ఎకరం ధర రూ.3 కోట్లకు పైగా పలుకుతున్నట్లు అంచనా. ఇంత విలువైన భూమిని పరిరక్షిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. యంత్రాలను పునరుద్ధరించి, శిక్షణ కేంద్రాలను ప్రారంభించి, పెట్టుబడిదారులను ఆకర్షిస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించే వీలుంది.

పోలేపల్లి గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో లెదర్‌ పార్కు అభివృద్ధికి చర్యలు చేపడతాం. ఇప్పటికే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిధులు విడుదల కాలేదు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, దళితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తాం.

– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement