ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి

Oct 29 2026 12:24 AM | Updated on Oct 29 2026 12:24 AM

వనపర్తి: రానున్న మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. 2023, అక్టోబర్‌ 31కి ముందు పట్టభద్రులైన వారు ఓటరు నమోదుకు అర్హులని.. నవంబర్‌ 6వ తేదీలోగా ఫారం–18 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని వారు సంబంధిత ఆర్డీఓ కార్యాలయం లేదా తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

బాలికలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

వనపర్తి రూరల్‌: బాలికలు విద్యలో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కార్తీక్‌రెడ్డి సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని నాగవరంతండా బాలికల గురుకుల పాఠశాలలో నల్సా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌–2026’ కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టం–2012పై విద్యార్థినులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాను అవసరమైన ప్రయోజనాలకే వినియోగించాలని, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలల రక్షణకు సంబంధించి సమస్యలు ఎదురైతే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098, న్యాయసాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 15100 సంప్రదించాలన్నారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెలర్లు కృష్ణయ్య, రఘు, శ్రీదేవి, డీసీపీఓ రాంబాబు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యురాలు వనజ, జిల్లా విద్యాశాఖ సీఎంఓ ప్రతాపరెడ్డి ప్రిన్సిపాల్‌ పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ఖిల్లాఘనపురం: విద్యార్థులు చిన్న వయసు నుంచే చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.దీప అన్నారు. బుధవారం మండల పరిధిలోని కస్తూర్భాగాంధీ విద్యాలయ, తెలంగాణ మోడల్‌ పాఠశాల, జిల్లాకేంద్రంలోని హరిజనవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ఆమె హాజరై మాట్లాడుతూ.. సురక్షిత్‌ బచ్చన్‌ అభియాన్‌ (పోక్స్‌ చట్టం–2012) లో భాగంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా బాలికల రక్షణకు ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు.

కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని అధ్యాపకులు కోరారు. పీయూలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. వివిధ యూనివర్సిటీల్లో సుమారు 1,200 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ వంటి అర్హతలున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్‌ అధ్యాపకుల నియామక ప్రక్రియలో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 30న నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి కాంట్రాక్టు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. భూమ య్య, శ్రీధర్‌రెడ్డి, రవికుమార్‌, సోమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

పత్తి క్వింటా రూ.9,060

జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌ యార్డులో బుధ వారం పత్తి క్వింటా గరిష్టంగా రూ.9,060, కనిష్టంగా రూ.8,860 ధర పలికింది. అలాగే ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకం గరిష్టంగా రూ. 3,301, కనిష్టంగా రూ.2,071, మొక్కజొన్న గరిష్టంగా రూ.3,072, కనిష్టంగా రూ.2,651, ఆముదాలు గరిష్టంగా రూ.7,966, కనిష్టంగా రూ.7,825 ధరలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement