ఖిల్లాఘనపురం: కమాలోద్ధీన్‌పూర్ బ్రాంచ్ కెనాల్ నుంచి 18 ఎల్, 19 టీఈ కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.14.50 లక్షల పరిహారం చెల్లించనున్నట్లు భూ సేకరణ అదనపు కలెక్టర్ తిరుపతయ్య తెలిపారు. బుధవారం మండలంలోని కమాలోద్ధీన్‌పూర్‌లో ఐబి డీఈ బాబుచంద్‌తో కలిసి భూ నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ శివారులో రెండు కాల్వల నిర్మాణానికి 180 మంది రైతులకు చెందిన సుమారు 25 ఎకరాల భూమి సేకరిస్తున్నట్లు చెప్పారు. ఆయా భూములకు ఎకరాకు రూ.14.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని.. సహకరించి అంగీకారపత్రంపై సంతకాలు చేస్తే రెండు నెలల్లో పరిహారం డబ్బులు ఖాతాల్లో జమచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశానికి హాజరైన రైతులు ఎకరాకు కనీసం రూ.16 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. అనంతరం కొందరు రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అంగీకరించి సంతకాలు చేయగా.. మరికొందరు త్వరలో తమ అభిప్రాయం చెబుతామని తెలిపారు. సమావేశంలో సర్పంచ్ గోపాల్, ఐబీ ఏఈ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


