వనపర్తి: జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన తొలుత స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అర్చక, ఆధ్యాత్మిక భవనాల పనులను పరిశీలించి మాట్లాడారు. ఆధ్యాత్మిక భవనం పనులను వచ్చే నెల 15 నాటికి, అర్చక భవనం నిర్మాణాన్ని వచ్చే ఏడాది జనవరి చివరిలోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆలయ చైర్మన్ రఘునాథాచార్యులు, పెబ్బేరు పుర చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ, ఏఈలు ఉన్నారు.


