సకాలంలో కోతలు పూర్తి..
150 బృందాలు.. 25 యంత్రాలు సిద్ధం
టన్నుకు రూ.3,810..
అమరచింత: కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు సాగుచేస్తున్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం ఈ ఏడాది ముందస్తు కోతలకు శ్రీకారం చుట్టింది. ఏటా దీపావళి అనంతరం కోతలు ప్రారంభమవుతుండగా.. ఈసారి 26వ తేదీ నుంచి కోతలు ప్రారంభించి పంట ఫ్యాక్టరీకి తరలించేందుకు యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా సరిపడా కోత కార్మికులను ముందస్తుగానే రప్పించి సకాలంలో కోతలు పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈసారి పంట దిగుబడి తగ్గుతుందని భావించి పక్క జిల్లాల నుంచి కూడా చెరుకు తరలించి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించింది. వర్షాలు సమృద్ధిగా లేని కారణంగా కొన్ని మండలాల్లో పంటకు వేరుపురుగు సోకడంతో ఎండుముఖం పట్టింది. దీనిని అరికట్టేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఎండిన, వేరుపురుగు సోకిన పంటలకు సైతం తగిన పరిహారం అందించాలని ఆయా మండలాల రైతులు కోరుతున్నారు.
2011లో ప్రారంభమై..
జిల్లాలోని కొత్తకోట మండలం రామకృష్ణాపురం పరిధిలో 2011, ఫిబ్రవరిలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. నాటి నుంచి జిల్లాలోని వివిధ మండలాలతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇతర మండలాల్లో ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రత్యేక చొరవచూపి చెరుకు సాగుపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చింది. అప్పటి వరకు వరి సాగుపై దృష్టి సారించిన రైతులు సైతం తక్కువ పెట్టుబడితో ఒకసారి సాగుచేస్తే మూడు పర్యాయాలు దిగుబడి వస్తుందనే ఆశతో చెరుకు సాగుకు ఆసక్తి కనబర్చారు. ఫ్యాక్టరీలో రోజు క్రషింగ్ జరగాలంటే 3,500 టన్నులు వినియోగించాల్సి ఉంది. చెరుకు క్రషింగ్‌తో పాటు కో–జనరేషన్ విద్యుదుత్పత్తి సైతం జరిగే విధంగా ఫ్యాక్టరీని నిర్మించారు.
అమరచింత శివారులో సాగుచేసిన చెరుకు తోట
ఫ్యాక్టరీ పరిధిలో ఈసారి మూడున్నర లక్షల టన్నుల నుంచి 4 లక్షల టన్నుల చెరుకు సేకరించడమే ప్రధాన లక్ష్యం. ఈ నెల 26 నుంచి క్రషింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 150 కోత కార్మికుల బృందాలతో పాటు 25 యంత్రాలను ముందస్తుగానే సమకూర్చాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా కోతలు సకాలంలో పూర్తి చేస్తాం.
– రామ్మోహన్,
కేన్ అడ్వయిజర్, కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ
సుమారు 4 లక్షల టన్నుల సేకరణే లక్ష్యం
టన్ను ధర రూ.3,810..
రాయితీ రూ.400 చెల్లింపు
ఫ్యాక్టరీ పరిధిలో 13 వేల ఎకరాలు.. 26 నుంచి క్రషింగ్ ప్రారంభం
ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం టన్ను చెరుకుకు రూ.3,810 ధరతో పాటు రూ.350 నుంచి రూ.400 వరకు అదనంగా చెల్లిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఫ్యాక్టరీ ప్రారంభంలో 3 వేల ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం 13 వేల ఎకరాలకు చేరిందని వివరించారు. ప్రారంభంలో కోతలతో పాటు రైతులకు డబ్బు చెల్లింపులో యాజమాన్యం అలసత్వం ప్రదర్శించడంతో సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. తర్వాత యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకొని సకాలంలో కోత కార్మికులను రప్పించడం, ఫ్యాక్టరీకి పంట తరలించిన 15 రోజుల్లోనే రైతు ఖాతాలో మద్దతు ధర జమ చేస్తుండటం, సాగు రైతులకు రాయితీలు, రుణాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలతో రైతులు చెరుకు సాగుపై దృష్టి సారించారు.


