నాగర్‌కర్నూల్/జడ్చర్ల/కల్వకుర్తి రూరల్/వంగూరు: దసరా పండుగను పుట్టిన ఊరిలోనే జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంగళవారం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో అడుగుపెట్టడంతో గ్రామస్తులంతా పులకరించిపోయారు. చిన్ననాటి నుంచి ఏస్థాయిలో ఉన్నా దసరా పండుగ రోజు స్వగ్రామానికి రావాలనే ఆనవాయితీని ముఖ్యమంత్రి కొనసాగించడం ఆనందంగా ఉందంటూ గ్రామస్తులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొండారెడ్డిపల్లికి సీఎం వస్తారని సీఎంఓ ప్రకటించగా.. 2:55 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, బాలునాయక్, కేవీన్ రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఇతర ఉన్నతాధికారులు సీఎంకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథంలో ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఆయనపై పూలవర్షం కురిపించారు. మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో, వేద పండితులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్దంగా సీఎంకు స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఆయన ఆంజనేయస్వామి, శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
స్వగ్రామంలో ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డి విజయదశమి వేడుకలు
ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
కుటుంబసమేతంగా ఆలయాలను దర్శించుకున్న సీఎం
గ్రామస్తులతో కలిసి శమీ పూజ
కల్వకుర్తి, జడ్చర్ల పట్టణాల్లో ఆకస్మిక పర్యటన
దేశంలోనే ఆదర్శంగా పాలమూరు..
దేశానికే ఆదర్శవంతమైన జిల్లాగా పాలమూరు అభివృద్ధి చెందాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నారు. యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించాలని.. పాలమూరు జిల్లా పసిడి పంటలతో పచ్చగా విరాజిల్లాలని కాంక్షించారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా రావణ దహనంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన డ్రోన్ షో ప్రజలను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ జానకి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్ హరిప్రియ, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, కల్వకుర్తి, జడ్చర్ల పట్టణాల్లో సీఎం పర్యటన షెడ్యూల్ ఆకస్మికంగా ఖరారు కావడం.. ఆయా ప్రాంతాల్లో సీఎం పర్యటన ప్రశాంతంగా కొనసాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


