అమరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 22 2026 12:27 AM | Updated on Oct 22 2026 12:27 AM

వనపర్తి: ప్రజల రక్షణ, దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయనతో పాటు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై పోలీసు అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీసులు తమ కుటుంబాలను సైతం పక్కనబెట్టి ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న పోలీసులందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని తెలిపారు. జిల్లా పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని.. ప్రజల కోసం వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారిలో నలుగురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారన్నారు. దేశ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న త్యాగాలు ఎంతో గొప్పవని కొనియాడారు. పోలీసు సేవలు సమాజానికి ఎంతో విలువైనవని.. అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో తమ పాత్రను కొనసాగించాలన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకునే గొప్ప సందర్భమన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు, ప్రమాదాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ప్రజలకు సేవలందించడం పోలీసుల బాధ్యత, నిబద్ధతకు నిదర్శనమన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు పోలీసుశాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని చెప్పారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ శాంతియుత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అమరవీరుల కుటుంబాల సభ్యులను ముఖ్యఅతిథులు సత్కరించి వారికి పోలీసుశాఖ తరపున కానుక అందజేశారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్‌ మాధవి, డీఎస్పీ గిరిబాబు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement