అమరచింత: చేనేత మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో కార్మికుడు ప్రతి నెల తన మూల వేతనంలో 3వ వంతు డబ్బులను బ్యాంకులో జమచేస్తే.. ప్రభుత్వం రెండింతల డబ్బును వారి ఖాతాలో జమ చేస్తుంది. జిల్లాలో జియోట్యాగ్ నంబర్ ఉన్న మగ్గాలు 310 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంలో ప్రధాన కార్మికుడితో పాటు ఒక అనుబంధ కార్మికుడికి చోటు కల్పించారు. జియోట్యాగ్ నంబర్కు ఇద్దరు మాత్రమే అర్హులు కావడంతో ప్రతి మగ్గానికి ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయంలోనే పథకం అమలుకాగా.. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతి మగ్గానికి ప్రధాన కార్మికుడు, సహాయ కార్మికుడు బ్యాంక్లో ఆర్డీ–1, ఆర్డీ–2 ఖాతాలను ప్రారంభించి ప్రతి నెల డబ్బులు జమ చేస్తున్నారు. ప్రధాన కార్మికుడు నెలకు రూ.1,200 జమ చేస్తే ప్రభుత్వం రూ.2,400.. అదేవిధంగా సహాయ కార్మికుడు రూ.800 జమచేస్తే ప్రభుత్వం రూ.1,600 జమ చేస్తున్నట్లు జౌళిశాఖ అధికారులు తెలిపారు.
19 నెలల బకాయిలు..
త్రిఫ్ట్ పథకానికి ప్రతి నెలా రూ.1,200 జమచేస్తున్నా. జమచేసిన డబ్బులకు రెండింతలు ప్రభుత్వం మా బ్యాంకు ఖాతాలో జమచేసేది. వీటితో కుటుంబ అవసరాలతో పాటు అప్పులు తీర్చుకునే వాళ్లం. 19 నెలలుగా మే ము డబ్బులు బ్యాంకు ఖాతాలో వేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం జమ చేయడం లేదు.
– పోతు ఉమ,
చేనేత కార్మికురాలు, అమరచింత
కుటుంబ అవసరాలు తీరేవి..
త్రిఫ్ట్ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులతో కుటుంబ అవసరాలు తీరేవి. గత ప్రభుత్వంలో ఏడాదికో పర్యాయం డబ్బులు చెల్లించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల చెల్లిస్తామన్నారు. అన్న మాట ప్రకారం రెండు నెలల డబ్బులు చెల్లించి తర్వాత ఇప్పటి వరకు డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేయడం లేదు. ప్రభుత్వం స్పందించి నిదులను వెంటనే మంజూరు చేయాలి. – మహంకాళి ప్రకాష్,
చేనేత కార్మికుడు, అమరచింత
తక్షణమే జమ చేయాలి..
ప్రభుత్వం ప్రకటించిన విధంగా త్రిఫ్ట్ నిధులను వెంటనే కార్మికుల బ్యాంకు ఖాతాలో జమచేయాలి. కార్మికుడు క్రమం తప్పకుండా వాటాధనం ఖాతాలో జమచేసిన తక్షణమే జౌళిశాఖ అధికారులు వాటికి రెండింతల డబ్బులను ఖాతాలో జమచేసి కార్మికులను ఆదుకోవాలి.
– వగ్గు రామలింగం,
చేనేత కార్మిక సంఘం నాయకుడు, అమరచింత
నిధులు మంజూరు కాలేదు..
త్రిఫ్ట్ ఫండ్ నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదు. మంజూరైన వెంటనే కార్మికుల ఆర్డీ–1, ఆర్డీ–2 బ్యాంకు ఖాతాలో వారికి రావాల్సిన వాటాధనం జమ చేయడానికి చర్యలు తీసుకుంటాం. 19 నెలల్లో కేవలం రెండు నెలల డబ్బులు మాత్రమే జమ చేశాం. మిగిలిన నెలల నిధు లు మంజూరైన వెంటనే జమచేస్తాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల
నిధుల మంజూరుపై నీలినీడలు
19 నెలలుగా చేనేత కార్మికులు ప్రతి నెల తమ వాటాధనాన్ని బ్యాంకులో జమచేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కేవలం 2 నెలల డబ్బులను మాత్రమే ఖాతాలో జమ చేసినట్లు నేత కార్మికులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిధులు మంజూరు చేయకపోవడంతో పథకం నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. తమ జీవనోపాధికి తోడుగా నిలిచే పథకానికి ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని నేత కార్మికులు కోరుతున్నారు.
కార్మికుడి నెలసరి మూల వేతనంలో రూ.1,200 పొదుపు
సహాయ కార్మికుడి నుంచి రూ.800
జిల్లాలో జియోట్యాగ్ కార్మికులు 310 మంది
19 నెలలుగా పెండింగ్లోనే ప్రభుత్వ వాటా


