పాన్గల్: ప్రస్తుతం నెలకొన్న కరువు కాలం తెచ్చింది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఈదమ్మ ఆలయం సమీపంలో ఉన్న కేఎల్ఐ ఎంజే–6 పరిధిలో ఎండిన వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం సాగునీరు ఇవ్వడం లేదని.. కనీసం విద్యుత్ సరఫరా సక్రమంగా చేస్తే చేతికొచ్చిన పంటను రైతులు కాపాడుకుంటారన్నారు. ఓ పక్క సాగునీటి కష్టాలు, మరోపక్క విద్యుత్ కోతలతో పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను తిట్టడం తప్ప రైతులకు సాగునీరు, విద్యుత్, రైతుబంధు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భీమా కాల్వ చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఘర్షణ పడుతున్నారని.. అధికారుల పర్యవేక్షణ లేకనే గొడవలు జరుగుతున్నాయని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంటలు చేతికందే దశలోనైనా సాగునీరు, కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని.. లేనిచో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్, న్యాయవాది రవికుమార్, చంద్రునాయక్, వెంకటయ్యనాయుడు, దాసునాయక్, గోపాల్రెడ్డి, రాంచందర్యాదవ్, సర్పంచ్లు కిశోర్నాయక్, కృష్ణనాయుడు, ఆయా గ్రామాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.


