వనపర్తి: ప్రతి పోలీస్ అధికారి ఆయుధాలపై కృతజ్ఞత భావం కలిగి ఉండాలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని జిల్లా సాయుధదళ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఆయుధాలు, పోలీసు వాహనాలు, రాజపేట శివారులోని పోలీసు పెట్రోల్ పంపు వద్ద సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందూ సాంప్రదాయంలో ఆయుధ పూజకు విశిష్ట ప్రాముఖ్యత ఉందన్నారు. విధి నిర్వహణలో వినియోగించే ఆయుధాలు, పరికరాలపై కృతజ్ఞత భావం కలిగి ఉండటమే ఆయుధ పూజ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆయుధాలు రాజ్యరక్షణ, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతీకలని తెలిపారు. ప్రజలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరిపై దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు, పోలీసు సిబ్బందికి ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధత, అప్రమత్తత, క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, సీఐలు ఓడీ రమేష్, సుగంధ రత్నం, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్కుమార్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


