రద్దీకి చెక్..
ప్రయాణానికి వేగం
పరుగులు పెడుతున్న మహబూబ్‌నగర్–డోన్ మధ్య డబ్లింగ్ రైల్వే లైన్
ట్రాక్షన్ సామర్థ్యం పెంపు
● చురుగ్గా సాగుతున్న రెండోట్రాక్ పనులు
● మహబూబ్‌నగర్–మన్యంకొండ
మధ్య పనులు పూర్తి..
● 90 కి.మీ. వేగానికి అనుమతి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైల్వే రంగానికి మహర్దశ రానుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్–సికింద్రాబాద్ మధ్య డబ్లింగ్ లైన్ అందుబాటులోకి రాగా.. తాజాగా మహబూబ్‌నగర్–డోన్ (ద్రోణాచలం) మధ్య రెండో రైల్వే లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 185 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పనులు పూర్తయితే హైదరాబాద్–డోన్ మార్గంలో రైళ్ల రాకపోకలకు మరింత వెసులుబాటు కలగనుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రైళ్ల సంఖ్య పెంచేందుకు అవకాశం ఏర్పడనుంది.
మన్యంకొండ వరకు పూర్తి
మహబూబ్‌నగర్–మన్యంకొండ స్టేషన్ల మధ్య రెండో ట్రాక్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 18న రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి ఈ మార్గాన్ని సమగ్రంగా తనిఖీ చేసి స్పీడ్ ట్రయల్ నిర్వహించారు. ప్రత్యేక మోటార్ ట్రాలీపై అధికారులతో కలిసి ప్రయాణిస్తూ ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ, వంతెనలు తదితరాలను పరిశీలించారు. కొత్త లైన్‌పై రైళ్ల స్థిరత్వం, భద్రత, సాఫీ ప్రయాణాన్ని పరీక్షించారు. అనంతరం ఈ సెక్షన్‌లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.
దేవరకద్ర వైపు పనులు
మన్యంకొండ–దేవరకద్ర మధ్య రెండో ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. దశల వారీగా డబ్లింగ్ పనులను పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపడుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు మొత్తం మార్గం పూర్తయితే ఈ ప్రాంత రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
మహబూబ్‌నగర్–డోన్ డబ్లింగ్ లైన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్–డోన్ మార్గంలో రైళ్ల రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్ల రాకపోకల కారణంగా ఎదురయ్యే ఆలస్యాలు తగ్గడంతో పాటు అదనపు రైళ్లను నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గే వీలుండటంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. సరుకు రవాణా వేగవంతమై.. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వాణిజ్య రవాణా కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
మేడ్చల్–ముద్ఖేడ్, మహబూబ్‌నగర్–డోన్ సెక్షన్లలో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ముద్ఖేడ్ నుంచి డోన్ వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న 12.5 వాట్ల సామర్థ్యాన్ని 25 వాట్లకు పెంచేందుకు ఆమోదం లభించింది. దీంతో విద్యుత్ వ్యవస్థలో లోపాలను అధిగమించి నిరంతర విద్యుత్ సరఫరాతో రైళ్లను మరింత సమర్థవంతంగా నడిపేందుకు వీలవుతుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి.


