సమన్వయంతోనే ’ఉల్లాస్‌’ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే ’ఉల్లాస్‌’ విజయవంతం

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌

ఎన్‌.ఖీమ్యానాయక్‌

వనపర్తి: సమన్వయంతో ఉల్లాస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాలో కార్యక్రమం అమలు, శిక్షణ, రాత పరీక్ష నిర్వహణ, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ప్రతి ఒక్కరికీ అక్షరాస్యత, విద్యా అవకాశాలు అందించడమే ఉల్లాస్‌ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. తమ రోజువారీ జీవితంలో చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్‌ సేవలు, డిజిటల్‌ సేవలు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై అవగాహన పెంచుకోవడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. అక్షరాస్యత వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని.. ముఖ్యంగా మహిళల అక్షరాస్యత పెంపొందించడంతో ఆర్థిక, సామాజికంగా మరింత సాధికారత సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉల్లాస్‌ కార్యక్రమం కింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 20,992 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ ప్రాంతాలకు చెందిన 1,200 మంది సభ్యులు శిక్షణ పొందుతున్నారని.. వీరంతా 20వ తేదీన నిర్వహించే రాత పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలో కార్యక్రమం సజావుగా, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అమలయ్యేలా జిల్లా పంచాయతీ అధికారి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ రాత పరీక్షకు తప్పనిసరిగా హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంగనన్‌వాడీ కేంద్రాల ద్వారా కార్యక్రమానికి అవసరమైన సహకారం, సమన్వయం అందించేందుకు జిల్లా సంక్షేమ అధికారి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ శిక్షణ నుంచి పరీక్షల వరకు ప్రతి దశను సమర్థవంతంగా పర్యవేక్షించి జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ రామమహేశ్వర్‌, డీపీఓ రఘునాథ్‌, డీడబ్ల్యూఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement