సాగునీటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కల సాకారం

Aug 24 2026 12:25 AM | Updated on Aug 24 2026 12:25 AM

ఖిల్లాఘనపురం: ఏళ్లుగా సాగునీరు లేక అల్లాడుతున్న అన్నదాతల ఆశలు ఎట్టకేలకు నెరవేరనున్నాయి. ఎత్తైన ప్రాంతంలోని అన్నదాతలకు సాగునీరు అందించి మోడువారిన బతుకులను చిగురింప జేసేందుకు నిర్మించిన కర్నెతండా లిఫ్ట్‌ను సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ డా. మల్లు రవితో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

2022, మార్చి 8న శంకుస్థాపన..

2022, మార్చి 8న కర్నెతండా లిఫ్ట్‌కు నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. మొదట్లో కర్నెతండాలోనే పైలాన్‌ను ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ గుట్టల మధ్యన ఉండటంతో భద్రత సమస్యలు తలెత్తుతాయని వనపర్తిలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి శంకుస్థాపన చేశారు.

3 మినీ కాల్వలతో..

కర్నెతండా నుంచి మూడు మినీ కాల్వల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రామాలు, గిరిజన తండాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించనున్నారు. కర్నెతండా కాల్వ నుంచి 5 కిలోమీటర్ల పొడవున 1,465 ఎకరాలకు సాగునీరు అందనుంది. జంగమాయపల్లి కాల్వ నుంచి 2.5 కిలోమీటర్ల పొడవున 1,105 ఎకరాలకు, మామిడిమాడ కాల్వ నుంచి 6.5 కిలోమీటర్ల పొడవున 1,665 ఎకరాలకు మొత్తం 4,235 ఎకరాలకు సాగునీరు అందేలా ప్రభుత్వం లిఫ్ట్‌ నిర్మాణం చేపట్టింది.

63 మీటర్ల ఎత్తుకు..

కర్నెతండా లిఫ్ట్‌ను ప్రభుత్వం రూ.87.53 కోట్లతో పూర్తి చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఖిల్లాఘనపురం బ్రాంచ్‌ కెనాల్‌కు 7వ కిలోమీటర్‌ శ్రీ ఆంజనేయస్వామి ఆలయం దగ్గర బిజినేపల్లి మండలం భీమునితండా మధ్యలో పంపుహౌస్‌ నిర్మాణం చేపట్టారు. ఒక మెగావాట్‌ పంపులు రెండింటితో 2.5 కిలోమీటర్ల పొడవు 63 మీటర్ల ఎత్తుకు పైపుల ద్వార సాగునీటిని తరలించనున్నారు. కర్నెతండా దగ్గర నీటిని నిల్వచేసి మూడు కాల్వల ద్వారా పలు గ్రామాల వ్యవసాయ పొలాలకు నీటిన తరలించనున్నారు.

కర్నెతండా లిఫ్ట్‌ ద్వారా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని బిజినేపల్లి, జిల్లాలోని ఖిల్లాఘనపురం, వనపర్తి, పెద్దమందడి మండలాల్లోని మామిడిమాడ, షాపురం, పర్వతాపురం, ఖిల్లాఘనపురం, మానాజీపేట, సోళీపురం, జంగమాయపల్లి, బలిజపల్లి, వీరాయిపల్లి, పామిరెడ్డిపల్లి, వెంకటాపూర్‌, లట్టుపల్లి, రుక్కన్నపల్లి గ్రామాలతో పాటు హన్‌మ్యాతండా, చిన్నపీర్‌తండా, పుల్‌సింగ్‌తండా, మిఠ్యాతండా, డాకుతండా, భీమునితండా, ఎర్రగడ్డతండా, కర్నెతండా, ఆముదంబండతండా, కోతులకుంటతండా, గార్లబండతండా, కుంటముందలితండా, మీదిగడ్డతండా, ముందలితండా, వెనికితండా, మేడిబాయితండా, దొంతికుంటతండా, ఎర్రగుట్టతండా మొత్తం 12 గ్రామాలు, 18 గిరిజన తండాల రైతులకు మేలు జరగనుంది.

నేడు కర్నెతండా ఎత్తిపోతలను ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రులు

4,235 ఎకరాలకు అందనున్న సాగునీరు

రూ.87.53 కోట్లతో నిర్మాణం

12 గ్రామాలు, 18 గిరిజన తండాల రైతులకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement