వనపర్తి: నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీలో రేగిన కొత్త.. పాత చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. గోపాల్‌పేటలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇవ్వగా.. ఇచ్చిన వివరణపై ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గాంధీభవన్ వద్ద మీడియా ఎదుట స్పందించారు. నోటీసులో పేర్కొన్న అంశాలను వదిలేసి సంబంధం లేని అంశాలతో వివరణ ఇచ్చారని, అన్నీ అబద్ధాలేనని తెలిపారు. చిన్నారెడ్డి మాట్లాడిన వీడియో, ఆడియోలు తన వద్ద ఉన్నాయని.. ఇచ్చిన వివరణ తమకు ఏ మాత్రం సంతృప్తిగా లేదని తెలిపారు. ఈ విషయంపై కమిటీ తనను పిలిస్తే పూర్తి ఆధారాలు సమర్పించడంతో పాటు తన ఆవేదనను వ్యక్తం చేస్తానని చెప్పారు.
పీఏసీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా నాయకులు, కేడర్‌ను క్రమశిక్షణతో మెలిగేలా సూచనలు ఇవ్వాలని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ సచిన్ సావత్‌ను కోరారు. నేతల అనుచిత వ్యాఖ్యలతో పార్టీలో నెలకొన్న గందరగోళంపై కమిటీ చర్చించినట్లు తెలిపారు.


