వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికిగాను అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.ఈశ్వరయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైనన్స్, వాణిజ్య శాస్త్రం (బీఎస్‌ఎఫ్‌ఐ), తెలుగు, ఆంగ్లం ఒక్కో పోస్ట్ చొప్పున ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలని, పీహెచ్‌డీ, నెట్, సెట్, గత విద్యాసంవత్సరం వరకు పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో దరఖాస్తును 25వ తేదీ సాయంత్రం 4లోగా కళాశాలలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 27న ఇంటర్వ్యూకు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒకకాపీ జిరాక్స్ పత్రాలతో ఉదయం 10 గంటల వరకు కళాశాలలో హాజరవ్వాలని సూచించారు.
కొత్తకోట సీఐగా ఓడీ రమేష్
కొత్తకోట రూరల్: కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఓడీ రమేష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన సీఐ రాంబాబు హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో డీఐజీ కార్యాలయం నుంచి ఓడీ రమేష్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని.. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.
వైఎస్సార్ కృషి ఫలితమే కేఎల్‌ఐ ప్రాజెక్టు
కొల్లాపూర్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగానే కేఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మితమైందని వైఎస్సార్‌సీపీ నందికొట్కూర్ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ అన్నారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామ శివారులో ఉన్న కేఎల్‌ఐ ప్రాజెక్టును పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేఎల్‌ఐ ప్రాజెక్టు వరప్రదాయిని అని పేర్కొన్నారు. ఐదేళ్ల వ్యవధిలోనే కేఎల్‌ఐ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేశారని గుర్తు చేశారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 3 లక్షలపైగా ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్, నాయకులు మధు, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


