మదనాపురం: ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెంచే దిశగా వైద్యులు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, సేవల తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా ఇన్, ఔట్ పేషెంట్ సేవలు, ఐరన్ సుక్రోజ్ పంపిణీ, గర్భిణుల అంచనా ప్రసవ తేదీ వివరాలు, ప్రసవాల సంఖ్య, టీ–హబ్ నమూనా రిజిస్టర్లు అలాగే వ్యాక్సిన్ డ్యూ జాబితాను తనిఖీ చేశారు. రోజువారీ ఇన్‌పేషెంట్లు, టీ–హబ్ నమూనా పరీక్షలు, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణులను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రసవ సమయం వరకు వారికి మెరుగైన వైద్య సలహాలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆయన వెంట డా. పరిమళ, డా. భవాని, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు.
గ్రామపంచాయతీ కార్మికులను క్రమబద్దీకరించాలి
ఖిల్లాఘనపురం: గ్రామపంచాయతీ కార్మికులను క్రమబద్దీకరించడంతో పాటు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎన్ రమేష్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కార్మికులు రెండ్రోజుల దీక్ష చేపట్టగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ఇచ్చిన హామీ మేరకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గ్రీన్ చానల్ ద్వారా ప్రతి నెల 1వ తేదీన కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమచేయాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వయస్సు పైబడిన, అనారోగ్యం పాలైన, మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీనివాసులు, పుష్ప, దాసు, గంగాదేవి, కుర్మమ్మ, నాగమణి, అలివేలు, దాసు, గోపాల్, కృష్ణయ్య, నాగయ్య, వెంకటేష్, నర్సింహులు, చెన్నయ్య పాల్గొన్నారు.
శాశ్వత మార్కెట్
ఏర్పాటుకు అడుగులు
కొత్తకోట రూరల్: పట్టణంలో ప్రస్తుతం ప్రైవేట్ స్థలంలో కొనసాగుతున్న మార్కెట్ సరిపోక వ్యాపార కార్యకలాపాలు ప్రధాన రహదారిపైకి విస్తరించి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి భవానమ్మ ఆలయం సమీపంలోని శనిగచెరువు కట్ట ప్రాంతంలో శాశ్వత మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా పుర చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్ బుధవారం తహసీల్దార్ సుభాష్‌నాయుడిని కలిసి సంబంధిత భూముల సర్వేనంబర్లు, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలం వివరాలను వెంటనే మున్సిపాలిటీకి అందజేయాలని కోరారు. శాశ్వత మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. శాశ్వత మార్కెట్ ఏర్పాటుతో వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద టీఎన్‌జీఓల భవనంలో నిర్వహించిన ఎన్‌ఎంయూ మహబూబ్‌నగర్ డిపో సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల తలరాత రాసే పూర్తిస్థాయి ఉద్యోగ భద్రతతో కూడిన విలీన ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడే తాము అనుకున్నవి సాధించుకోగలుగుతామన్నారు. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ సంఘాన్ని గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉందన్నారు. అంతకు ముందు డిపో కమిటీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శిగా భానుప్రకాష్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


