ఆయిల్‌పాం సాగుతో అధిక ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం సాగుతో అధిక ఆదాయం

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

ఆరుతడి పంటలే సాగు చేయాలి

రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి

కే.సురేంద్రమోహన్‌

వనపర్తి: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు వరికి బదులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యానశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి పెబ్బేరు మండలం జనంపల్లి శివారులోని రైతుల పొలాలను సందర్శించి పంటల సాగు పరిస్థితులను పరిశీలించారు. అనంతరం గ్రామ రైతులతో మాట్లాడి పంటల సాగు, నీటి లభ్యత, ఎరువుల సరఫరా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తాను కంది సాగు చేసినట్లు రైతు బాలరాజు తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించడంతో సాగు చేపట్టినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామంలో వరి సాగు విస్తీర్ణం తగ్గిందని.. పలువురు రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. తాను ఆయిల్‌పాం సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నట్లు మరో రైతు వెంకటస్వామి వ్యవసాయశాఖ కార్యదర్శికి వివరించారు. యూరియా, ఇతర ఎరువుల సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఆయనకు తెలియజేశారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆయిల్‌పాం సాగుతో మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని.. ఆసక్తిగల రైతులు దృష్టి సారించాలన్నారు. ఆయిల్‌పాం సాగుతో లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటస్వామిని అభినందించడంతో పాటు రైతునేస్తం కార్యక్రమంలో భాగస్వామిని చేసి తన అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా ఆయిల్‌పాం తోటల్లో ఏయే అంతర పంటలు సాగు చేస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుందనే అంశంపై అధికారులు అధ్యయనం చేసి శాసీ్త్రయంగా సూచనలు అందించాలని కోరారు. నీటి లభ్యత, పంటల ఎంపిక, అంతర పంటల సాగు, ఎరువుల వినియోగంపై శాసీ్త్రయ అవగాహన కల్పిస్తూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఇతర ప్రాంతాల్లో రైతులు అవలంబిస్తున్న విధానాలపై క్షేత్రస్థాయి సందర్శనకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్‌, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement