పాన్‌గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లితండా సమీపంలో ఉన్న కేఎల్‌ఐ డీ–1 కాల్వలో జమ్ము, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎర్లకుంటతండా సమీపం నుంచి తెల్లరాళ్లపల్లితండా వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర కాల్వలో పెరిగిన జమ్ము, పూడిక తొలగించకపోవడంతో సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కాల్వ ద్వారా మండలంలో తెల్లరాళ్లపల్లి, తెల్లరాళ్లపల్లితండా, చిక్కేపల్లి గ్రామాల్లో సుమారు 600 ఎకరాల ఆయకట్టు ఉండగా.. సాగునీరు సక్రమంగా అందక సగం కూడా సాగు కావడం లేదు. ఖరీఫ్ సీజనల్‌లోనైనా జమ్ము, పూడిక తొలగించి సాగునీరు సాఫీగా అందేలా చర్యలు తీసుకోవాలంటూ రైతులు గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు 30 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చేసేది లేక రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రెండ్రోజులుగా కాల్వలో పేరుకపోయిన జమ్ము తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాల్వ ద్వారా సాగునీరు సరఫరా అవుతున్నా.. జమ్ముతో తండా వరకు సాగునీరు సరఫరాగాకపోవడంతో స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నట్లు రైతులు వివరించారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కాల్వ మరమ్మతు చేపట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


