జిల్లాలో మూడోవిడతకు 24 ఉన్నత పాఠశాలలు ఎంపిక
● ఏడాది గడుస్తున్నా.. ప్రతిపాదనలకే పరిమితం
● వసతులు, డిజిటల్ విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు
● నైపుణ్య కోర్సులను కోల్పోతున్న వైనం
ఆమోదం రావాల్సి ఉంది..
జిల్లాలోని 24 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మూడోవిడత పీఎంశ్రీ పథకం అమలుకు ప్రతిపాదించాం. ఇప్పటి వరకు వాటికి ఆమోదం లభించలేదు. ఆమోదం లభిస్తేనే విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన విద్యను అందించడంతో పాటు పాఠశాలల రూపురేఖలు మారుతాయి. ఈ పథకంలో అధునిక సదుపాయాలకు నిధుల మంజూరుతో పాటు సివిల్ వర్క్స్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తారు.
– శేఖర్, సెక్టోరియల్ అధికారి, వనపర్తి
వనపర్తిటౌన్: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌స్థాయిలో తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంతికేక విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎంశ్రీ పథకం జిల్లాలో మూడోవిడత ప్రతిపాదనలకే పరిమితమైంది. మొదటి, రెండు విడతలు పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం మూడోవిడతలో 24 పాఠశాలలను ఎంపిక చేసి ఏడాది గడుస్తున్నా నేటికీ పెండింగ్‌లో ఉంచడంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయా పాఠశాలలకు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఆమోదం లభించకపోవడంతో విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. జిల్లాలో పీఎంశ్రీ పథకాన్ని దశల వారీగా అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మొదటి విడతలో 10 పాఠశాలలు ఎంపిక చేసి వాటిలో అభివృద్ధి పనులు, డిజిటల్ తరగతుల నిర్మాణం చేపట్టారు. ఆ విజయాన్ని ఆధారంగా చేసుకుని రెండోవిడతలో మరో 11 పాఠశాలలను ఎంపిక చేయగా కేంద్రం నిధులు మంజూరు చేసింది. వీటిలో 6 ప్రాథమిక పాఠశాలలు, 3 కేజీబీవీలు, 4 రెసిడెన్షియల్ పాఠశాలలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ), ఒక మోడల్ స్కూల్, 7 జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలలకు డిజిటల్ పరికరాలు, నిధులు అందడంతో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు సమకూరాయి. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా మిగిలిన పాఠశాలల విద్యార్థులకు కూడా ఆయా ప్రయోజనాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు మూడోవిడతలో 24 జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించారు. ఏడాది గడుస్తున్నా ఆమోదముద్ర పడకపోవడంతో ఆయా పాఠశాలల విద్యార్థులు ముఖ్యమైన ప్రయోజనాలను కోల్పోతున్నారు.
పాన్‌గల్‌లోని పీఎంశ్రీ పాఠశాలలో కరాటే శిక్షణలో విద్యార్థినులు (ఫైల్)


