నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి : ఎస్పీ

Aug 8 2026 12:17 AM | Updated on Aug 8 2026 12:17 AM

వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా ఉత్సాహంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారి నేర సమీక్ష నిర్వహించగా.. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని, అండర్‌ ఇన్వెస్టిగేషన్‌, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులకు సంబంధించి డాక్యుమెంట్స్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్స్‌, మెడికల్‌ సర్టిఫికెట్లు త్వరగా తెప్పించి ఛేదించాలని సూచించారు. ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని కోరారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఠాణాకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యను శ్రద్ధగా విని సత్వర పరిష్కారం అందించాలని కోరారు. పోలీస్‌శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే స్పందనలో మానవీయ దృక్పథం, సేవల్లో వేగం, దర్యాప్తులో నిబద్ధత ఉండాలన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం, ఆర్థిక నేరాలు, సైబర్‌ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీసు అధికారి తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించాలని, ప్రజలతో మమేకమై ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం వేగంగా చేరేలా చూడాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని, ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, పెట్రోల్‌ బంకులు, దాబాలు తదితర ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా తరచూ తనిఖీ చేసి సాంకేతిక సమస్యలుంటే వెంటనే మరమ్మతు చేయించాలన్నారు. డయల్‌ 100 ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని, డ్రంకెన్‌ డ్రైవ్‌, నాకాబందీలు, నైట్‌ పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సమీక్షలో డీఎస్పీ గిరిబాబు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్‌ సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేష్‌, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement