వనపర్తి: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక 2025–26 కింద రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల షెడ్యూల్డ్ కులాల యువత ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు ఆధార్, రేషన్‌కార్డు, కులం, ఆదాయం, విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు, వ్యవసాయ పథకాలకు 21 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు, శిక్షణ పథకాలకు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. సంవత్సర ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించరాదని, ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిపొందిన కుటుంబాలు అనర్హులని, ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు పత్రాలను ఎస్పీ కార్పొరేషన్ వనపర్తి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు http://obmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో గా ని, కార్యాలయంలోగాని సంప్రదించాలన్నారు.
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి
పాన్‌గల్: గ్రామాల్లోని ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ కోరారు. పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల గుర్తింపులో భాగంగా శుక్రవారం మండలంలోని బుసిరెడ్డిపల్లి, జమ్మాపూర్‌లో పర్యటించి ఉపాధి కూలీలు, స్థానిక సమస్యలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూలీలకు ఇబ్బందికరంగా ఉన్న వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దుచేసి పాత చట్టానే పునరుద్ధరించాలన్నారు. కూలీలకు 8 వారాలకుపైగా కూలి డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉపాధి కూలీల సమస్యలు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న మండలస్థాయిలో నిర్వహించే ధర్నాకు కూలీలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెల్లరాళ్లపల్లి సర్పంచ్ జంబులయ్య, నాయకులు భీమయ్య, రాము, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
‘ఇందిరమ్మ ఇంటి’ బిల్లుల కోసం లంచం డిమాండ్
అయిజ: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లు చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అయిజ మండలంలోని ఎక్లాస్‌పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బోయ రంగన్న ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లు చేసేందుకు లబ్ధిదారుల నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంల సమీపంలో లబ్ధిదారుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి మొదటి విడత బిల్లు చెల్లించేందుకు, తదుపరి మూడు వాయిదాలకు అంతరాయం లేకుండా బిల్లులు చెల్లించేందుకు రూ.20 వేలు డిమాండ్ చేశారని, లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఓ ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్‌లో జడ్జి ముందు హాజరు పరుస్తామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వేరుశనగ క్వింటా రూ.8.519
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,519, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు రూ.5,889, జొన్నలు రూ.5,273, పెబ్బర్లు రూ.4,850, ఆముదాలు రూ.6,144, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,840, కనిష్టంగా రూ.1,631, ధాన్యం హంస రూ.1,891, ఆర్‌ఎన్‌ఆర్ రూ.2,051 ధరలు పలికాయి.


