కొత్తకోట: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పుర కేంద్రంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, 2కే రన్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు రూపొందించబడిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని.. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. చదువుకునే వయస్సులో చెడు వ్యసనాల బారిన పడకుండా క్రమశిక్షణ, మంచి ఆశయాలతో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


