‘ఉపాధి’ని యథావిధిగా కొనసాగించాలి
పాన్‌గల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని రేమద్దులలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2004 సంవత్సరంలో సీపీఎం ఒత్తిడి యూపీఏ ప్రభుత్వం సంవత్సరానికి 100 రోజుల పని దినాలు కల్పిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఈ పథకం కొనసాగిందన్నారు. ప్రజలందరూ 200 పని దినాలకు పెంచి రోజు, వారి వేతనం రూ.600 ఇవ్వాలని పోరాటాలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడగులు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. వెనిజులాపై అమెరికా దాడులను పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అమెరికా కస్టడీలో ఉన్న వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మధుర దంపతులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్, నాయకులు వెంకటయ్య, భగత్, భాస్కర్, చంద్రశేఖర్, ఎండీ ఖాజా, మల్లేష్, కె.వెంకటయ్య, శివరాజు, రేవతిరెడ్డి, అంజనేయరెడ్డి, చిన్ననిరంజన్ పాల్గొన్నారు.


