ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
వనపర్తిటౌన్: ఈ నెల 21 నుంచి జరగబోయే ఇంట ర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రైవేట్ కళాశాలలు సర్వం సిద్ధం చేసుకోవాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం డీఐఈఓ కార్యాలయంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న మొదటి సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు, 23న నైతికత – మానవ విలువల పరీక్ష, 24న పర్యావరణ విద్య పరీక్ష జరగనుందన్నారు. సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రాక్టికల్స్ నిర్వహణకు సీసీ కెమెరాలు, ల్యాబ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇంటర్ బోర్డ్ కొత్తగా ప్రవేశపెట్టిన హాల్ టికెట్ల ప్రివ్యూను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుని అందులోని వివరాలు సరి చూసుకునేలా అవగాహన కల్పించాలని, అభ్యంతరాలు ఉంటే ప్రిన్సిపాల్స్ వెంటనే జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పారు. నామినల్ రోల్స్ చెక్ చేయడం, స్టాఫ్ డేటా మొదలైన వాటిపై చర్చించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


