పుర ఎన్నికల్లో సత్తా చాటుదాం : బీజేపీ
ఆత్మకూర్: స్థానిక పురపాలికలోని 10 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మేర్వ రాజు, పుర మాజీ ఫ్లోర్‌లీడర్ అశ్విన్‌కుమార్ కోరారు. శుక్రవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పుర ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీచేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణులు పొత్తు పెట్టుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పుర ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై ప్రజలకు నమ్మకం లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరి, ఆంజనేయులు, తమ్మలి విజయ్, ఆనంద్, తమ్మలి వెంకటేష్, రాము, విష్ణువర్ధన్‌రెడ్డి, శివశంకర్, శ్యామ్, సమద్, అనీల్‌గౌడ్, కొండాపురం రాము తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 975 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.


