‘తప్పుల తడకగా ఓటరు జాబితా’
అమరచింత: పురపాలిక ఎన్నికల సందర్భంగా గురువారం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని పట్టణవాసులు , సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. పుర, తహసీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై పది వార్డులకు సంబంధించిన ఓటరు జాబితాలను గురువారం ప్రదర్శించారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు వార్డుల వారీగా పరిశీలించగా జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించలేదని.. ఇప్పుడు ఓటర్ల పేర్లు ఏకంగా వార్డుల వారీగా తారుమారు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో పురుష ఓటర్లు 4,404, మహిళా ఓటర్లు 4,813, మొత్తం ఓటర్లు 9,217 మంది ఉన్నారని.. వీరంతా తమ తమ వార్డుల్లో ఓటు వేసేలా ఓటరు జాబితాను సవరించాలని కోరుతున్నారు. పుర కమిషనర్‌తో పాటు మేనేజర్, సిబ్బంది మద్య సఖ్యత లేక ఓటరు జాబితాలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.


