‘కొత్త’ సంబురం..
● నూతన సంవత్సరానికి
స్వాగతం పలికిన జిల్లా ప్రజలు
● ఇళ్ల ముంగిట కనిపించిన
రంగురంగుల రంగవల్లులు
● ఆలయాల్లో ప్రత్యేక పూజలు
వనపర్తి టౌన్: జిల్లా ప్రజలు నూతన సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ఇళ్లతో పాటు కాలనీలలో కేక్‌లు కట్ చేయడంతో పాటు ఒకరికొకరు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. యువత ‘విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు. గురువారం ఉదయం మహిళలు, యువతులు ఇళ్ల ముంగిళ్లను రంగురంగుల రంగవల్లులతో అలంకరించారు.
కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలంటూ ప్రజలు ఉదయాన్నే ఆలయాలకు చేరడంతో కిక్కిరిశాయి. శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంతో పాటు జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, పాండురంగ విఠలేశ్వరస్వామి, చింతల హనుమాన్, బ్రహ్మంగారి ఆలయాలతో పాటు రామాలయం, కన్యకాపరమేశ్వరి ఆలయాలు, ఆత్మకూర్‌లోని సాయిబాబా, అయప్పస్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. అలాగే జిల్లాకేంద్రంతో పాటు ఆత్మకూర్‌లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


