పక్కాగా రహదారి భద్రత మాసోత్సవాలు
వనపర్తి: జిల్లాలో గురువారం నుంచి ప్రారంభించిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా రోడ్డు రవాణాశాఖ అధికారులతో కలిసి జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల వాల్‌పోస్టర్లు, కరదీపికలు, స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రోజుకు ఒకటి చొప్పున నెల రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు సవ్యంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు, యువత, వాహనదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. 8వ తేదీన కలెక్టరేట్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి లఘు నాటికలు ప్రదర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 9వ తేదీన జిల్లాలోని లారీడ్రైవర్లు, 13న ఆటోడ్రైవర్లు, 19న తుఫాన్, ఇతర లైట్ గూడ్స్ వెహికిల్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలపై ఒకరోజు కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా రోడ్డు రవాణా అధికారి మానస, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం, వెహికిల్ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


