ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు
వనపర్తిటౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో 2025 సంవత్సరంలో అతి తక్కువ సెలవులు తీసుకున్న ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని ఆయన శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి మాట్లాడారు. సెలవులు ఉన్నా.. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యున్నతి కోసం తక్కువ వినియోగించుకొని తోటి వారికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉత్తమ సిబ్బందిని సన్మానించడంతో తోటివారు నూతనోత్తేజంతో పని చేస్తారని, తద్వారా ప్రభుత్వ కళాశాలలు మరింత మెరుగుపడి విద్యార్థులకు లాభం చేకూరుతుందని తెలిపారు. వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున అధ్యాపకులు విద్యార్థులకు అందుబాటులో ఉండి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అతి తక్కువ సెలవులు తీసుకున్న వారిలో ప్రిన్సిపాల్స్ హైమావతి, భీమసేన, అధ్యాపకులు రాజి, కవిత, శిరీష, శ్రీనివాస్, రవీందర్, బోధనేతర సిబ్బంది శ్రీరాములు, మహబూబున్నీసా బేగం ఉన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


