కలెక్టరేట్ ఎదుట ఆశాల ఆందోళన
వనపర్తి రూరల్: పల్స్‌పోలియో, కుష్టు సర్వే, ఎన్నికల విధుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని జిల్లా ఆశా కార్యకర్తల సంఘం (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని మర్రికుంట నుంచి కలెక్టరేట్ వరకు ఆశా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం కార్యదర్శి బుచ్చమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎన్ రమేష్, జిల్లా కార్యదర్శి మండ్ల రాజు తదితరులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎన్నికల సమయం ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని కోరారు. జిల్లా వైద్యాధికారి రెండువారాల్లో కుష్టు సర్వే డబ్బులు చెల్లిస్తామని చెప్పారని.. వెంటనే విడుదల చేయాలన్నారు. ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం జిల్లా నాయకులు గిరిజ, ఇందిర, లత, అలివేలు, శ్యామల, చెన్నమ్మ, భాగ్యమ్మ, లక్ష్మి, మహేశ్వరమ్మ పాల్గొన్నారు.


