రాష్ట్రంలోనే ప్రత్యేకంగా జిల్లాలో అమలు
2,904 మందికి స్క్రీనింగ్..
● ప్రజారోగ్యంపై కలెక్టర్ చొరవ
● అభినందించిన డబ్ల్యూహెచ్‌ఓ
బృందం, గవర్నర్
● కంటిచూపు నివారణకు ముందస్తు చర్యలు
వనపర్తి: విద్య, వైద్యంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజారోగ్యంలో భాగంగా 2025లో రెండు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టారు. ఆయా కార్యక్రమాలు విజయవంతం కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం, గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 1న కొత్తకోట పీహెచ్‌సీని సందర్శించిన డబ్ల్యూహెచ్‌ఓ బృందం జిల్లాలో కొనసాగుతున్న మిషన్ మధుమేహ, దృష్టి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్న వారు కంటిచూపు సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గుర్తించిన కలెక్టర్ ముందస్తు చర్యల్లో భాగంగా దృష్టి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం ఇతర ప్రాంతాలకు ఆదర్శమని డబ్ల్యూహెచ్‌ఓ బృందం ప్రతినిధులు కితాబునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమం అమలు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖకు సిఫారస్ చేయనున్నట్లు వారు రాష్ట్ర పర్యటనలో వెల్లడించారు.
ఇటీవల జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పర్యటించిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఆయా కార్యక్రమాలపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లు, నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, ముందుజాగ్రత్త చర్యలు, శస్త్రచికిత్సల సిఫారస్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని కలెక్టర్, వైద్యబృందాన్ని అభినందించారు. ఆయా కార్యక్రమాలు త్రిపురలోనూ అమలు చేసేందుకు ఓసారి రాజ్‌భవన్‌కు రావాలంటూ గవర్నర్ స్వయంగా కలెక్టర్‌కు ఆహ్వానించడం గమనార్హం.
కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం..
జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారు కంటిచూపు కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, సూచనలు చేయడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం దృష్టి లోపంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శుక్లం (కాంటాక్) ఆపరేషన్‌తో పాటు కళ్లద్దాలు ఇవ్వడం, తీవ్రతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం, ప్రతినెల వారికి అవసరమైన మాత్రలు, మందులు అందిస్తున్నారు. మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా పలు దఫాల్లో 40 ఏళ్లు నిండిన 3.06 లక్షల మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించి.. 19,643 మంది వ్యాధిగ్రస్తులుగా గుర్తించారు. వీరికి భవిష్యత్‌లో తలెత్తే కంటిచూపు సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా దృష్టి కార్యక్రమాన్ని రూపొందించారు.
పీహెచ్‌సీల వారీగా
మధుమేహ వ్యాధిగ్రస్తులు
జిల్లాలోని 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో నవంబర్ 14 నుంచి మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రెండు యంత్రాలను కొనుగోలు చేసి ఇప్పటి వరకు 2,904 మందిని పరీక్షించి 225 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఆప్తమాలజిస్ట్‌లు మరోమారు పరీక్షలు చేయాలనే నిబంధన ఉండటంతో ఇప్పటి వరకు 116 మందిని వైద్యుడు పరీక్షించి 20 మందిని శస్త్రచికిత్సలకు సిఫారస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర కారణాలతో మరో 109 మంది పరీక్షలు వాయిదా పడ్డాయి.
రాష్ట్రంలోనే ప్రత్యేకంగా జిల్లాలో అమలు


