ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Dec 27 2025 9:47 AM | Updated on Dec 27 2025 9:47 AM

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

వనపర్తి: అహంకారపూరిత అధికారం, మద్యం, డబ్బు ఏవీ నిబద్ధత ఎదుట నిలబడలేవని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిరూపించాయని.. బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు అధికార పార్టీకి ధీటుగా విజయం సాధించడం గర్వంగా ఉందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాపార్టీ కార్యాలయంలో కృష్ణానది జలాల హక్కుల సాధన, పార్టీ గ్రామపంచాయతీ పాలకవర్గాల సన్మాన కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా మాజీ మంత్రి నివాసం నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు గులాబీ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకు రెండేళ్లకే విరక్తి వచ్చిందని పంచాయతీ ఫలితాలతో స్పష్టమవుతోందన్నారు. రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 45 రోజుల పాటు వచ్చిన జూరాల జలాలను సముద్రానికి వదిలేశారని.. వరద జలాలను ఒడిసి పట్టుకునే చేతగాని పాలకులని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడలేక యాసంగి సాగుకు క్రాప్‌ హాలిడే ప్రకటించారన్నారని విమర్శించారు. ఖిల్లాఘనపురం మండలం సోళీపురం, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామపంచాయతీ ఫలితాలపై అనుమానం ఉందని.. రీ కౌంటింగ్‌ కోసం కోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రధాన గ్రామాల్లో పార్టీ మద్దతుదారులు విజయఢంకా మోగించారని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన గోపాల్‌పేటలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు బీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చారని గుర్తుచేశారు.

అభివృద్ధి చేసి చూపండి..

విమర్శలు కాదు.. ఇచ్చిన హామీలు అమలుచేసి, అభివృద్ధి పనులు చేసి చూపించాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి అధికార పార్టీకి సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకంతో ఊరూరా ట్యాప్‌లు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌పై దృష్టి సారించిందని ఆరోపించారు. గ్రామ పాలకులకు విశేష అధికారాలు ఉంటాయని, చట్టం తెలుసుకొని ప్రజలకు మంచి పాలన అందించాలని సర్పంచులు, వార్డు సభ్యులకు సూచించారు. 2018లో అప్పటి ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తీసుకొచ్చిందని, కేంద్రం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు వస్తాయని వివరించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, వైద్యంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, పట్టణ అధ్యక్షుడు రమేష్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్‌, నాయకులు మాణిక్యం, విజయ్‌, కురుమూర్తి యాదవ్‌, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement