ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన
వనపర్తి రూరల్: మండలంలోని అంకూరులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సేకరించిన వరి ధాన్యాన్ని వెంటనే తరలించాలంటూ రైతులు గురువారం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి ధాన్యం కేంద్రంలో రెండు నెలలుగా ఆరబోసుకున్నామని, తూకం చేసిన సంచులను తరలించకపోవడంతో వరాహాల దాడి ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 లారీల ధాన్యం కేంద్రంలో నిల్వ ఉందని.. వెంటనే తరలించాలని వారు కోరారు. ఆందోళనతో రహదారిపై రాకపోకలు నలిచి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని అధికారులు, రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.


