
ముఖ గుర్తింపుతో సామాజిక పింఛన్లు
● 165 జీపీల్లో పోస్టల్ సిబ్బందిచే పంపిణీ
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: జిల్లాలో గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా అందించే సామాజిక పింఛన్లు ఇక నుంచి లబ్ధిదారుల ముఖ గుర్తింపుతో ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్‌లో పోస్టల్ సిబ్బందికి 74 సెల్‌ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత తదితర సామాజిక పింఛన్లు 71వేల మందికి పైగా లబ్ధిదారులు పొందుతున్నట్లు తెలిపారు. వీరిలో దాదాపు 50శాతం మందికి ప్రతినెలా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండగా.. మిగతా 32వేల మంది పింఛన్‌దారులు 165 జీపీల్లో పోస్టాల్ సిబ్బందిచే పింఛన్లు పొందుతున్నారన్నారు. ఆయా జీపీల్లో కొందరు పింఛన్‌దారులకు ఆధార్ కార్డు ప్రకారం వెలిముద్రల గుర్తింపు జరగక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇక నుంచి సెల్‌ఫోన్‌లో ముఖచిత్ర గుర్తింపు ద్వారా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ప్రభాకర్ పాల్గొన్నారు.
● జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట వద్ద రూ. 1.25 కోట్లతో చేపట్టిన కళాశాల బాలికల వసతిగృహ నిర్మాణ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. వసతిగృహ నిర్మాణ పనులను నవంబర్‌లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మొత్తం 120మంది విద్యార్థులు వసతి ఉండే విధంగా భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాసులు, ఆర్‌ఐ మధు ఉన్నారు.
అర్జీలు సత్వరం పరిష్కరించాలి..
వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 45 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు.