
హాస్టళ్లలో ఫీవర్రీ .!
ఇంటిబాట పట్టిన కేజీబీవీ, వసతిగృహాల విద్యార్థులు
● పాఠశాలల్లో మచ్చుకై నా కనిపించని వైద్యశిబిరాలు
● ఎవరైనా అనారోగ్యం బారినపడితే మందు గోళీలతోనే సరిపెడుతున్న వైనం
● ఇటీవల అనారోగ్యంతో కేజీబీవీ విద్యార్థిని మృతి
విద్యార్థుల
ఆరోగ్యంపై అశ్రద్ధ..
కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ ఎవరికీ పట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమ పాఠశాల, కేజీబీవీలు, ఎస్సీ హాస్టల్‌లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లి మందులు ఇప్పించడం తప్ప.. వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించడం లేదని విద్యార్థులే బహిరంగంగా చెబుతున్నారు. ఇటీవల ఖిల్లాఘనపురం కస్తూర్బాగాంధీ తెలుగు మీడియం పాఠశాలలో 11మంది విద్యార్థినులు అనారోగ్యం బారిన పడితే సిబ్బంది స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న వైద్యసిబ్బంది ఎలాంటి పరీక్షలు చేయకుండానే.. జ్వరం వచ్చిందని చెప్పి గ్లూకోస్ పెట్టి, కొన్ని మందులు ఇచ్చి పంపారు. అయితే వీరిలో 9వ తరగతి విద్యార్థిని కేతావత్ జ్యోతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. తెల్లపసిరికల కారణంగా ఈ నెల 17న మృతిచెందింది. అయితే సదరు విద్యార్థిని తెల్లపసిరికలకు గురైనట్లు ముందుగానే గుర్తించి.. సరైన చికిత్స అందించి ఉంటే ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధ చేయొద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఖిల్లాఘనపురం: జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పేదలు తమ పిల్లలను ఎలాగైనా చదివించాలనే సంకల్పంతో ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను సైతం కుటుంబ సభ్యులు కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు అనారోగ్యానికి గురై ఇళ్లకు చేరుకోవడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా మంది విద్యార్థులు విషజ్వరాలకు గురై ఇంటిబాట పడుతున్నారు. ఇళ్ల వద్ద తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవడం.. ఇతర కుటుంబ సభ్యులు వారిని ఆర్‌ఎంపీల వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో వారాల పాటు విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఎక్కడా లేనివిదంగా ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండటంతో పాటు ఎస్టీ ఆశ్రమ పాఠశాల, ఎస్సీ వసతిగృహాలు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియం కేజీబీవీలో ఈ సంవత్సరం ఇంటర్ తరగతులను ప్రారంభించారు. రెండు కేజీబీవీలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థినులు చదువుకోవడానికి వస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆయా పాఠశాలలు, ఎస్సీ వసతిగృహంలో మొత్తం 919 మంది విద్యార్థులు చదువుకుంటుండగా.. ఇప్పటి వరకు 269 మంది పలు అనారోగ్య కారణాలతో ఇళ్లకు వెళ్లారు. వారు మళ్లీ ఎప్పుడు పాఠశాలకు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
పాఠశాల విద్యార్థుల ఇళ్లకు
సంఖ్య వెళ్లిన వారు
కేజీబీవీ తెలుగు మీడియం 207 117
కేజీబీవీ ఇంగ్లిష్ మీడియం 226 36
ఎస్టీ ఆశ్రమ 366 66
ఎస్సీ హాస్టల్ 120 50
మొత్తం 919 269

హాస్టళ్లలో ఫీవర్రీ .!