
అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
● ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పొరపాట్లు జరిగితే అధికారులదే బాధ్యత
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వీపనగండ్ల: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు బొల్లారంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా రూ. 3.90లక్షలతో చేపట్టనున్న వీపనగండ్ల–బెక్కెం బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వీపనగండ్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు 19 కుట్టు మిషన్లు అందజేశారు. ఆ తర్వాత బొల్లారంలో రూ. 20లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రూ. 5లక్షలతో ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి పొరపాట్లు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. గతంలో తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో రూ. 300కోట్లతో సీసీరోడ్లు, రూ. 600కోట్లతో బీటీరోడ్లు నిర్మించినట్లు తెలిపారు. పలు గ్రామాల ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం చిన్నంబావి మండలాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు వైద్య, విద్యరంగాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. వీపనగండ్లలో తన పేరున ఉన్న నాలుగెకరాల భూమిని మినీ స్టేడియం ఏర్పాటు కోసం ఉచితంగా అందజేయడంతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ద్వారా రూ. 3కోట్లతో స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, పీఆర్ ఈఈ మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరయ్యయాదవ్, నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య, సుదర్శన్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, గోపి, మహేశ్, బాల్‌రెడ్డి, గోపాల్‌నాయక్, రాంరెడ్డి, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.