
ఎరువు.. కరువు...
రైతులకు తీరని యూరియా కష్టాలు
● క్యూలైన్లలో నిలుచున్న వారికి టోకన్లు పంపిణీ
ఖిల్లాఘనపురం: మండల రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. బుధవారం సాయంత్రం 450 బస్తాలు సింగిల్‌విండో కార్యాలయానికి చేరింది. గురువారం ఉదయం యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా రైతులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయ సిబ్బంది చేసేదిలేక బుధవారం టోకన్లు ఇచ్చిన ఒక్కో రైతుకు రెండు బస్తాలను పంపిణీ చేశారు. వచ్చిన రైతులకు యూరియా సరిపోకపోవడంతో మిగిలిన వారికి టోకన్లు ఇచ్చి పంపారు. 243 టోకన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. యూరియా వచ్చిన వెంటనే ముందుగా వారికి పంపిణీ చేస్తామని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
ఖిల్లాఘనపురం సింగిల్‌విండో కార్యాలయం వద్ద అన్నదాతలు
ఆత్మకూర్: స్థానిక పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం మండల రైతులు గురువారం తెల్లవారుజామున ఐదు నుంచి పడిగాపులు పడ్డారు. సాయంత్రం వరకు లారీ రాకపోవడంతో సిబ్బంది చేసేది లేక నో–స్టాక్ బోర్డును ఏర్పాటు చేయడంతో రైతులు కంగుతిన్నారు. పొలం పనులు వదిలి రైతులు పొద్దంతా నిలుచుంటే యూరియా లేదంటూ బోర్డు పెట్టి వెళ్లిపోవడం ఏమిటని.. రైతులంటే అలుసుగా ఉందా అంటూ పలువురు రైతుసంఘం నాయకులు అధికారులను నిలదీశారు. ఒకానొక దశలో రైతులు, పీఏసీఎస్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో సీఐ శివకుమార్ అక్కడకు చేరుకుని క్యూలో నిలుచున్న రైతులకు టోకన్లు ఇప్పించారు. శుక్రవారం యూరియా రాగానే మొదట టోకన్లు ఇచ్చిన వారికి పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. మొత్తం 72 మంది రైతులకు టోకెన్లు ఇచ్చినట్లు రైతులు వివరించారు.

ఎరువు.. కరువు...

ఎరువు.. కరువు...