
వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే చర్యలు
వనపర్తిటౌన్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కనీస అవసరాలను పిల్లలు తీర్చకపోతే ఫిర్యాదు చేయవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై చట్టాల గురించి వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న వారిని గౌరవించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి అత్యధికంగా రూ.10 వేల వరకు మెయింటనెన్స్ కోరవచ్చన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకపోయిన, గృహంలో స్థానం కల్పించకపోయినా వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం 2007 ప్రకారం ఆర్డీఓకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎవరైనా తల్లిదండ్రులను నిరాశ్రయులను చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని, న్యాయ సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని పేర్కొన్నారు. అనంతరం వృద్ధుల హక్కులకు సంబంధించిన లఘు చిత్రాన్ని వృద్ధులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మండల సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.