
ఫౌండేషన్ శిక్షణ పేద విద్యార్థులకు వరం
వనపర్తిటౌన్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదవలేని, ఆర్థికంగా వెనుకబడిన బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోనే ఐఐటీ, నీట్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ లభించడం వరమని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ శిక్షణను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.వేలు వెచ్చించలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు ఈ అవకాశం లభించడం శుభపరిణామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఇదే పాఠశాలలో విద్యనభ్యసించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ప్రధానోపాధ్యాయుడు గురురాజు యాదవ్ శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాఠశాలలో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గురురాజుయాదవ్, మండల విద్యాధికారి మద్దిలేటి, ఉపాధ్యాయ బృందం, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.