
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం
వనపర్తి రూరల్: పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన శ్రీరంగాపురం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఠాణా పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. పరిసరాలు, సీజ్‌చేసిన వాహనాలు, రిసెప్షన్, రికార్డు గదిని పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నేరాల అదుపునకు కృషి చేయాలని, నిరంతరం గస్తీ నిర్వహిస్తూ గంజాయి, మట్కా, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి గ్రామానికి పోలీసు అధికారిని కేటాయించి వీపీఓ విధానం పక్కాగా అమలు చేయాలన్నారు. వీపీఓలు రోజు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా చూడాలని, బ్లూకోర్ట్, పెట్రోకార్ విధులు నిర్వర్తించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సాయంత్రం వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నరేష్, ఎస్‌ఐలు రామకృష్ణ, యుగంధర్‌రెడ్డి, పోలీస్ అధికారులు ఉన్నారు.
బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి
ఎస్పీ రావుల గిరిధర్