
ఇక సాగనంపడమే..
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో కోర్ ఏరియాలో ఉన్న ఐదు చెంచుపెంటల రీలొకేషన్‌కు కేంద్ర పర్యావరణ శాఖ సలహాకమిటీ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో ఐదు చెంచుపెంటల్లోని స్థానికులను అడవి నుంచి బయటకు తరలించి అక్కడ పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ శాఖ సలహా కమిటీ సూత్రప్రాయంగా ఆమోదించడంతో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో కుడిచింతల్‌బైల్, కొల్లంపెంట, తాటిగుండాల పెంటల్లోని 417 కుటుంబాలతో పాటు రెండోవిడతలో వటవర్లపల్లి, సార్లపల్లి గ్రామాల్లోని 836 కుటుంబాలను అడవి నుంచి బయటకు తరలించి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది.
వన్యప్రాణులు– మనుషులకు
మధ్య ఘర్షణ నివారించేందుకు..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో నివసిస్తున్న స్థానిక చెంచులను ఇక్కడి నుంచి తరలించి నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బాచారం సమీపంలో పునరావాసం కల్పించనున్నారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆవాసాలకు ఆటంకాలను నిర్మూలించడం, మనుషులకు – వన్యప్రాణులకు మధ్య ఘర్షణలను నివారించేందుకు, పర్యావరణ సంరక్షణలో భాగంగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) నిర్వాసితులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందిస్తోంది. స్వచ్ఛందంగా అడవి నుంచి బయట నివసించాలనుకునే వారికి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా ఇల్లు, ఐదెకరాల వ్యవసాయ భూమిని అందిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రీలొకేషన్ సర్వే, గ్రామసభలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు గ్రామస్తుల నుంచి అంగీకారపత్రాలను తీసుకున్నారు. సార్లపల్లి గ్రామంలోని 30 కుటుంబాలు మినహా, కొల్లంపెంట, కుడిచింతల్ బైల్, తాటిగుండాల, వటవర్లపల్లి గ్రామాల్లోని స్థానికులు రీలొకేషన్‌కు అంగీకారం తెలిపారు.
ఎంఓయూ తర్వాత..
గ్రామసభలు, జిల్లాస్థాయి కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) కమిటీల ఆమోదం మంగళవారం కేంద్రం పర్యావరణశాఖ సలహా కమిటీ సైతం ఆమోదం తెలిపింది. దీంతో నిర్వాసితుల నుంచి మెమొరెండమ్ ఆఫ్ అండర్ స్టాడింగ్(ఎంఓయూ) పత్రాలపై సంతకాలను తీసుకున్న తర్వాత గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మరో రెండు నెలల్లోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని చెంచుపెంటల తరలింపునకు కేంద్రం ఆమోదం
నల్లమల అడవి నుంచి
రెండు దశల్లో 5 గ్రామాల రీలొకేషన్
నిర్వాసితుల నుంచి ఎంఓయూ అనంతరంప్రారంభం కానున్న
తరలింపు ప్రక్రియ
ప్రభుత్వం పూర్తిస్థాయిలో
పునరావాసం కల్పించాకే పంపించాలంటున్న చెంచులు
పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద పునరావాస కేంద్రం
జీవనోపాధిపై నమ్మకం కల్పించాకే..
తమకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా పూర్తిస్థాయిలో పునరావాసం పూర్తయిన తర్వాతే అడవి నుంచి తరలించాలని చెంచులు కోరుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకున్న తమకు బయటకు తీసుకెళ్లాక జీవనోపాధి కరువవుతుందని ఆందోళన చెందుతున్నారు. పునరావాసం తర్వాత ఉపాధి లేక ఇబ్బందులు పడతామని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించడంతో పాటు జీవనోపాధిపై నమ్మకం కలిగించాకే తమను అడవి నుంచి బయటకు తరలించాలని కోరుతున్నారు.
మానవీయ కోణంలో తరలింపు చేపడతాం
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రెండు దశల్లో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ఉంటుంది. నిర్వాసితులకు ఎన్టీసీఏ ద్వారా పూర్తిస్థాయిలో పరిహారం అందించాకే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రీలొకేషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకువచ్చిన వారికే ప్యాకేజీ అందించి తరలింపు చేపడతాం. – రోహిత్ గోపిడి,
ఐఎఫ్‌ఎస్, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్
అడవిలో తప్ప బయట బతకలేం..
మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటు న్నాం. అడవిలో ఉన్న ఆధా రం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం. – దంసాని లింగయ్య,
కొల్లంపెంట, అమ్రాబాద్ మండలం
పునరావాసం ఇచ్చాకే పోతాం
మేం ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు వేరే పని తెలువదు. పులులు, వన్యప్రాణుల కోసం మమ్మల్ని బయటకు పొమ్మని అంటున్నారు. మాకు చెప్పినట్టుగా పూర్తిగా పరిహారం, ఇల్లు, భూమి ఇచ్చాకనే పోతాం.
– గోరటి చంద్రమ్మ, కుడిచింతల్‌బైల్

ఇక సాగనంపడమే..

ఇక సాగనంపడమే..

ఇక సాగనంపడమే..