
యూరియా పక్కదారి పట్టొద్దు
వనపర్తి: యూరియా వ్యవసాయానికి మినహా ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో తరలడానికి వీలు లేదని, పక్కదారి పట్టకుండా రైతులకు అవసరం మేరకు అందేలా చూడాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం 2,500 మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర కాంప్లెక్ ఎరువులు ఉన్నాయని, క్రమం తప్పకుండా వస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మున్ముందు దొరకదనే ఆలోచనతో ఎగబడి కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ప్రతి వారం వస్తూనే ఉంటుందని చెప్పారు. రైతులకు అవగాహన కల్పించి ప్రస్తుతం ఉన్న అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో దుకాణాలు, సొసైటీ గోదాములను తనిఖీ చేయాలని.. బ్లాక్‌మార్కెట్‌పై టాస్క్‌ఫోర్స్ బృందం ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, కో–ఆపరేటివ్‌శాఖ అధికారి ప్రసాదరావు, ఏడీఏలు, మార్కెటింగ్‌శాఖ అధికారి స్వరణ్‌సింగ్, రవాణాశాఖ అధికారి మానస తదితరులు పాల్గొన్నారు.
రైతులు అవసరం మేరకే కొనుగోలు చేయాలి
ఇన్‌చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి