
డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి: డ్రైవర్లు రహదారి భద్రత నిబంధనలు విధిగా పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్ధేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఆపాలన్నారు. మద్యం తాగి, సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్‌లలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలని.. సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని కోరారు. బస్సును రోజూ తనిఖీ చేయాలని, టైర్లు, బ్రేకులు, ఇతర భాగాలను పరిశీలించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే, యాజమాన్యానికి చెప్పి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సిగ్నల్స్, మలుపులు, ప్రధాన కూడళ్లలో వేగాన్ని నియంత్రించాలన్నారు. వాహనం నడిపేటప్పుడు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని.. సమయపాలన పాటిస్తూ విద్యార్థులతో ఓపిక, సహనంగా, మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి సీఐ కృష్ణయ్య, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్‌ఎస్సై సురేందర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్