భూ సేకరణ వేగవంతం చేయాలి
వనపర్తి: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కేఎల్‌ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కేటగిరి–1 ప్రాధాన్యత కింద నిర్ధారించిన భూములను త్వరగా సేకరించి ఇరిగేషన్‌శాఖకు అప్పగించాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. జయన్న తిర్మలాపూర్‌లో 12.95 ఎకరాలు, రేవల్లి మండలం కేశంపేటలో 29.24 ఎకరాలు సర్వే చేసి పెగ్ మార్క్ చేయాలని, సర్వేయర్లను పంపించి వారంలో సర్వే చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రేమద్దుల డి–8, కర్నెతండా ఎత్తిపోతలకు సంబంధించిన భూ సేకరణ చేపట్టాలని సూచించారు. షాపూర్‌లో 28.32 ఎకరాలు, మల్కాపూర్‌లో 8.35 ఎకరాలు, పొల్కెపాడులో భూ సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. గణపసముద్రం, బుద్ధారంలో 96 ఎకరాలకు అవార్డ్ పాసైనందున రైతులకు పరిహారం చెల్లింపులు జరిగేలా చూడాలని భూ సేకరణ అధికారిని ఆదేశించారు. ఖిల్లాఘనపురం మండలం అల్లమాయపల్లిలో 10 ఎకరాలు, మిల్క్‌మియాన్‌పల్లిలో 6 ఎకరాలు, తిర్మలాయపల్లిలో 23 ఎకరాలు సైతం కేటగిరి–1లో ఉన్నందున జూన్ చివరి నాటికి సర్వే చేపట్టి అవార్డ్ పాస్‌చేసి ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తి కావాలన్నారు. సర్వేయర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో భూ సేకరణ పూర్తి చేయాలని కోరారు. ఇక నుంచి ప్రతి వారం భూ సేకరణ పురోగతిపై సమీక్ష ఉంటుందని, పూర్తయిన నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో భూ సేకరణ ప్రత్యేక అధికారి, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్‌ఈ జె.శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్ కార్యనిర్వాహక ఇంజినీర్ మధుసూదన్‌రావు, ఏడీ సర్వే బాలకృష్ణ, ఇరిగేషన్ ఈఈ కేశవరావు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్ పాల్గొన్నారు.


