యువతను మించిన సంపద లేదు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి
వనపర్తి టౌన్: దేశ భవిష్యత్‌కు యువతను మించిన సంపద లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత సరైన మార్గంలో పయనించకుంటే దేశ భవిష్యత్ అంధకారమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పానియాలు, పదార్థాల బారిన పడకుండా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చెడు వ్యసనం లేని భారతావనే లక్ష్యంగా ముందుకు సాగితే అగ్రగామిగా నిలబడుతోందని దీమా వ్యక్తం చేశారు. ధనవంతుల పిల్లలు అత్యధికంగా ఫ్యాషన్ మోజులో పడి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని తెలిపారు. ఒత్తిడికి గురైనప్పుడు ధ్యానం, యోగా చేయాలని తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ప్రతి అంశానికి ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండటం నేర్చుకోవాలని, మౌనానికి మించిన సంపద లేదని వివరించారు. అనంతరం వ్యసనం లేని సమాజాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు నషాముక్త్ భారత్ రథాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అఖ్తర్, కమర్‌మియా, యాదయ్య, బాబా, సమద్, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు శోభ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.


