కొనుగోళ్లకు కొర్రీలు?
లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం
●
వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవస్థలు తప్పడం లేదు. తాలు, తేమశాతం, లారీలు, హమాలీల కొరత, మట్టిపెడ్డల శాతం పేరుతో ధాన్యం కొనుగోలుకు కొర్రీలు పెడుతుండటంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. ఇందుకు పలు గ్రామాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ఘటనలే ఉదాహరణగా చెప్పవచ్చు. జిల్లాలో సన్న, దొడ్డురకం వరి ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా 481 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో దొడ్డురకం కేంద్రాలు 226, సన్నాలు కొనేందుకు 255 కేంద్రాలు ఉన్నాయి. దొడ్డురకం కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. దొడ్డురకం ధాన్యాన్ని తరలించేందుకు లారీ డ్రైవర్లు సైతం విముఖత చూపుతున్నారు. మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోరనే భావన డ్రైవర్లలో నెలకొంది. మిల్లర్లు సన్నాలను మాత్రమే తీసుకోవడం, దొడ్డు రకాలను చాలావరకు ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తుండటంతో గోదాముల వద్ద హమాలీలు లేక నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
అన్నదాతల ఆందోళన..
తాలు ఎక్కువగా ఉందని ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ వీపనగండ్ల మండలం తూంకుంట, గోవర్ధనగిరిలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. ఇటీవల వనపర్తి మండలం అంకూరు, గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామాల్లోనూ కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాస్తారోకోలు చేశారు. ఈ విషయంపై అధికారులు నిత్యం క్షేత్ర పర్యటనలు చేస్తున్నా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు..
కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు లారీలు సరిపోవడం లేదు. దీంతో రోజురోజు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ధాన్యం కేంద్రానికి తీసుకొచ్చినప్పటి నుంచి లారీల్లో తరలించే వరకు రైతుదే బాధ్యత కావడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శుక్రవారం వరకు జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా.
రూ.275 కోట్ల ధాన్యం కొనుగోలు..
జిల్లావ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభమైన నెలరోజుల్లో సుమారు రూ.275 కోట్ల విలువైన 1,18,871 మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేసింది. 65 శాతం మేర ట్యాబ్ ఎంట్రీలు పూర్తికావడంతో చెల్లింపులు సుమారు రూ.165 కోట్ల మేర చేసినట్లు తెలుస్తోంది.
తాలు పేరుతో ఇబ్బందులు..
గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ.. కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పెట్టారు. తాలును సాకుగా చూపి బస్తాకు మూడు కిలోల వరకు అధికంగా ఽతీసుకుంటున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేసేవారు.
– జగన్‌రెడ్డి, రైతు, తూంకుంట (వీపనగండ్ల)
హమాలీల కొరతతో జాప్యం..
ధాన్యం కొనుగోలులో సమస్యలు ఉత్పన్నం కాకుండా రెవెన్యూ అదనపు కలెక్టర్‌తో కలిసి పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా సమస్య వస్తే అక్కడికి వెళ్లి పరిష్కరించి వెంటనే కొనుగోళ్లు చేయిస్తున్నాం. హమాలీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోంది.
– జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాలశాఖ
తాలు పేరుతో అధికంగా తూకం
ఆందోళన బాటలో అన్నదాతలు
తరుగు పేరిట దోపిడీ..
కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో 40 కిలోల బస్తాకు సుమారు 3 కిలోల ధాన్యం ఎక్కువగా తూకం చేయాలని నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వివిధ ప్రజాసంఘాల నాయకులు నిరసనలు చేసినా.. తీరు మారడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
కొనుగోళ్లకు కొర్రీలు?
కొనుగోళ్లకు కొర్రీలు?
కొనుగోళ్లకు కొర్రీలు?


